Andhra Pradesh: తాంత్రిక పూజలు చేశా.. దయచేసి క్షమించండి.. శ్రీశైలం ఆలయ ఈవోకు పూజారి రాధాకృష్ణ శర్మ లేఖ!
- ఇంట్లో అర్ధరాత్రి పూజలు చేసిన రాధాకృష్ణ శర్మ
- సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు
- క్షమాపణలు కోరుతూ లేఖ అందించిన శర్మ
శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం వేద పండితుడు రాధాకృష్ణ శర్మ తన ఇంటి వద్ద తాంత్రిక పూజలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వివాదం తలెత్తడంతో, ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ శర్మ స్పందించారు. తన ఇంటిలో రాత్రిపూట పూజలు చేసిన మాట నిజమేనని ఒప్పుకున్నారు. హైదరాబాద్కు చెందిన సురేశ్చంద్రతో కలిసి తాను పూజలు చేశానని అంగీకరించారు. ఈ మేరకు ఓ లేఖను బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆలయ ఈవోకు లేఖ సమర్పించారు.
తనపై వచ్చిన అభియోగాలన్నీ నిజమని రాధాకృష్ణ శర్మ అంగీకరించారు. భవిష్యత్లో ఇలాంటి పనులు చేయబోనని, క్షమించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ ఏపీ మానవహక్కుల కమిషన్, హైకోర్టుల్లో దాఖలుచేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటానని వెల్లడించారు. ఇంకోసారి ఇలాంటివి పునరావృతమైతే తనను పూర్తిగా విధుల నుంచి తప్పించాలని రాధాకృష్ణ శర్మ అభ్యర్థించారు. దీంతో మెత్తబడ్డ ఈవో.. రాధాకృష్ణ శర్మపై విధించిన సస్పెన్షన్ ను రెండ్రోజుల్లో ఎత్తివేసి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు.