Chandrababu: చంద్రబాబుకు కేసీఆర్ మంచి సలహా ఇచ్చినప్పుడు అక్కడ నేనూ ఉన్నా!: బాల్క సుమన్
- నాడు కేసీఆర్ అయుత చండీయాగం నిర్వహించారు
- బాబును ఆహ్వానించినప్పుడు కేసీఆర్ తో నేనూ ఉన్నా
- కృష్ణా, గోదావరి జలాలను చక్కగా వాడుకుందామని చెప్పారు
ఏపీ అభివృద్ధి కావాలని కోరుతూ చంద్రబాబుతో కేసీఆర్ చెప్పినప్పుడు ఆయనతో పాటు తాను కూడా అక్కడ ఉన్నానని, అందుకు, తానే సాక్ష్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు నిర్వహించిన అయుత చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్ తో పాటు తాను, ఈటల రాజేందర్ విజయవాడ వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు.
ఆ రోజు చంద్రబాబునాయుడి నివాసంలో భోజనం చేసేందుకు వారు వెళ్లిన సందర్భంలో జరిగిన ఓ విషయాన్ని బాల్క సుమన్ గుర్తుచేసుకున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో కలిపి నాలుగు వేల టీఎంసీల నీళ్లున్నాయని, మనం ఈ నీటిని చక్కగా వాడుకుందామని, ప్రాజెక్టులు కట్టుకోమని ఆ రోజున కేసీఆర్ చాలా స్పష్టంగా చంద్రబాబుకు చెప్పారని అన్నారు.
తెలంగాణకు కేటాయించిన నదీ జలాలు పోగా, మిగిలిన నీళ్లన్నీ కిందకే వస్తాయి కనుక బ్రహ్మాండంగా ఆ నీటిని వినియోగించుకోవచ్చని చంద్రబాబుకు కేసీఆర్ మంచి సలహా ఇచ్చారని చెప్పారు. తెలంగాణ రైతులైనా, ఆంధ్రా రైతులైనా బాగుపడటం ముఖ్యమని, ప్రాజెక్టులు కట్టుకోమని చంద్రబాబుకు మంచిగా కేసీఆర్ చెప్పారని అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా చంద్రబాబుకు ప్రాజెక్టులు కట్టడం, అభివృద్ధి చేయడం చేతకావట్లేదని విమర్శించారు.