Telangana: కూటమికి తెలంగాణలో తొలి ఎదురుదెబ్బ తగిలింది: ప్రధాని మోదీ
- కూటమి కలయిక ఓ గేమ్
- వీరి అజెండా ‘మోదీ’
- తెలంగాణలో కూటమికి పరాజయం ఎదురైంది
బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వీళ్లందరూ తమను తాము కాపాడుకునేందుకు ఒకరి వైపు మరొకరు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. వీరి కలయిక ఓ గేమ్, దేశానికి ఏదన్నా మంచి పని చేయాలన్నది వీరి అజెండా కాదని, వీరి అజెండా ‘మోదీ’ అని దుయ్యబట్టారు.
తెలంగాణలో కూటమికట్టిన చంద్రబాబుకు ఘోరపరాజయం ఎదురైందని, ఆ రాష్ట్రంలో కూటమికి దారుణ పరిస్థితి ఎదురైందని, కూటమి పేరుతో బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసినంత మాత్రాన ఓటర్లు కలవరని తేలిపోయిందని అన్నారు. త్రిపుర, కశ్మీర్ లోనూ కూటమికి ఘోర పరాభవం ఎదురైందని, అవినీతి శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చినప్పుడు వారి వెంట ఉండాలో వద్దో ప్రజలే నిర్ణయించుకుంటారని మోదీ అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా గతంలో కాంగ్రెస్ ను వ్యతిరేకించిన వాళ్లేనని, ఆ పార్టీలో చేరుతున్న వాళ్లను కాంగ్రెస్ బలిపశువులను చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ లేదనడం అసత్య ప్రచారమని, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని అన్నారు.