Telangana: చలిపులికి వణుకుతున్న ప్రజలు.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- తలుపు గడియలు కూడా తీసేందుకు భయపడుతున్న ప్రజలు
- చలి గుప్పిట్లో ఏజెన్సీ ప్రాంతాలు
- అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణశాఖ
తెలంగాణలో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటితే కానీ తలుపు గడియ తీయడం లేదు. గత వారం రోజులుగా రాష్ట్రం చలి గుప్పిట్లో చిక్కుకుపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత మరింత పెరగడంతో మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చలి నుంచి కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడి ప్రజలు చలికి అల్లాడిపోతున్నారు. బయటకు తొంగిచూసేందుకు కూడా భయపడుతున్నారు. మంగళవారం తిర్యాణి మండలంలో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జైనూరులో 5.2, ఆసిఫాబాద్లో 5, కెరమెరిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.