YSRCP: తుది అంకానికి చేరిన జగన్ పాదయాత్ర!
- దాదాపు ఏడాదికిపైగా సాగిన పాదయాత్ర
- నేడు తుది నియోజకవర్గమైన ఇచ్చాపురంలోకి
- జనవరి 9 నాటికి పాదయాత్ర ముగింపు!
ప్రజా సమస్యలు తెలుసుకునే దిశగా, పాదయాత్రను చేపట్టి దాదాపు ఏడాదికిపైగా ప్రజల్లో ఉంటూ 335 రోజుల పాటు నడిచిన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర తుది దశకు చేరుకుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర, నేడు శ్రీకాకుళం జిల్లాలో చివరి నియోజకవర్గమైన ఇచ్చాపురం చేరుకోనుంది. ఇచ్చాపురంలో దాదాపు 60 కిలోమీటర్లకు పైగా జగన్ పాదయాత్ర సాగనుండగా, జనవరి 9 నాటికి ఇది పూర్తవుతుందని వైకాపా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అదే రోజు జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనే జగన్, ఆ వెంటనే తిరుమలకు వెళ్లి, శ్రీవారి మెట్టు మార్గంలో కొండపైకి చేరుకుని స్వామిని దర్శించుకోనున్నారు. ఆపై సాధ్యమైనంత త్వరగా, పాదయాత్ర మార్గంలో తాను వెళ్లని నియోజకవర్గాల్లో పర్యటించి, అక్కడి ప్రజలను కలవాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని వైకాపా వర్గాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి.