transport department: డ్రైవింగ్ లైసెన్స్ జారీలో రవాణా శాఖ సమూల మార్పులు.. ఇకపై నాలుగు రకాలే!
- టూ వీలర్ విత్, వితౌట్ గేర్ విభాగాలు
- లైట్ మోటారు వెహికల్స్, రవాణా వాహనాలు మిగిలిన రెండు
- ఆధార్ చూపిస్తే సరిపోతుంది
లైసెన్స్ జారీ విషయంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రకరకాల విభాగాలు, ప్రత్యేక విభాగాలు.. అంటూ లేకుండా ఇకపై మొత్తం వాహనాలను నాలుగు రకాలుగా విభజించి నాలుగు రకాల లైసెన్స్లు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి రవాణా శాఖ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్.రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇకపై టూ వీలర్ విత్ గేర్, వితౌట్ గేర్, లైట్ మోటార్ వెహికల్, రవాణా వాహనాలుగా విభజించి లైసెన్స్లు జారీ చేస్తారు.
విత్గేర్, వితౌట్ గేర్ విభాగంలోకి అన్ని రకాల ద్విచక్ర వాహనాలు వస్తాయి. వాహనం గరిష్ట బరువు 7500 కిలోలు దాటని వాహనాలను లైట్ వెహికల్స్ కింద చేర్చారు. ఇందులో అన్ని ఆటోలు (త్రిచక్ర, గూడ్స్), నాలుగు చక్రాల ( కార్లు తదితరాలు సొంతం, అద్దెవి, రవాణావి, పాసింజర్, కమర్షియల్) వాహనాలు వస్తాయి.
ఈ వాహనాలకు లైసెన్స్ పొందేందుకు ఎటువంటి ధ్రువపత్రాలు ఇవ్వక్కర్లేదు. లైసెన్స్ పొందగోరు వ్యక్తికి ఆధార్ ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకు పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఎల్ఐసీ బాండ్ పేపర్, కనీస విద్యార్హత వంటి నిబంధనలు ఉండేవి. దీంతో వాటిని సంపాదించడం కోసం నానాపాట్లు పడాల్సి వచ్చేది.ఇకపై పద్దెనిమిదేళ్లు నిండిన వారు ఆధార్ చూపించి, డ్రైవింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తే లైసెన్స్ మంజూరు చేస్తారు. మూడేళ్ల అనుభవం ఉంటే బ్యాడ్జి కేటాయింపు వంటి జంజాటం లేనట్టే.
నాలుగో విభాగమైన రవాణా వాహనాలకు మాత్రం ఎనిమిదో తరగతి విద్యార్హత తప్పనిసరి. 7500 కిలోల కంటే ఎక్కువ గరిష్ట బరువు ఉన్న వాహన చోదకులు ఎనిమిదో తరగతి ధ్రువపత్రం, ఆధార్ చూపి లైసెన్స్ పొందవచ్చు. తాజా మార్పుల వల్ల లైసెన్స్ మంజూరు సులభతరమవుతుందని, దీనివల్ల అర్హులందరూ లైసెన్స్ పొందుతారని అధికారులు తెలిపారు. అందువల్ల పోలీసుల తనిఖీల్లో పలు నిబంధనల సాకుతో వసూలు చేస్తున్న జరిమానా భారం కూడా వాహన చోదకులపై తగ్గనుంది.