Anna DMK: లోక్ సభ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ.. 26 మంది ఎంపీలపై సస్పెన్షన్
- ‘మేకదాటు’ ప్రతిపాదనపై తీవ్ర నిరసన
- వెల్లోకి ప్రవేశించి నినాదాలు
- నిరసన తెలపడం తమ హక్కన్న తంబిదురై
కావేరి నదిపై కర్ణాటకలో మేకదాటు ఆనకట్టను నిర్మించాలని ప్రతిపాదించడంపై అన్నాడీఎంకే ఎంపీలు లోక్సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వెల్లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. దీంతో అన్నాడీఎంకే ఎంపీలపై లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ కఠిన చర్యలు తీసుకున్నారు.
ఆ పార్టీకి చెందిన 26 మంది ఎంపీలను సభా కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారంటూ వరుసగా ఐదు రోజుల పాటు సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు. దీనిపై అన్నాడీఎంకే నేత తంబిదురై మాట్లాడుతూ.. కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కొన్ని సీట్లైనా గెలవాలనే కోరికతో మేకదాటు ఆనకట్ట నిర్మాణానికి అనుమతించారని ఆరోపించారు. నిరసన తెలపడం తమ హక్కని, కానీ ప్రభుత్వం స్పందించటం లేదన్నారు.