Mumbai: ఘరానా మోసం.. మిస్డ్ కాల్స్‌తో రూ. 1.86 కోట్లు మాయం చేసిన కేటుగాళ్లు!

  • సిమ్ స్వాప్ టెక్నాలజీతో భారీ మోసం
  • ముంబై వ్యాపారి ఖాతా నుంచి డబ్బులు మాయం
  • 14 ఖాతాలకు డబ్బు బదిలీ.. ఆపై డ్రా

ముంబైలో జరిగిన ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చి సంచలనమైంది. కేవలం మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ఓ వ్యాపారి బ్యాంకు ఖాతాలోని రూ.1.86 కోట్లను కాజేశారు. సిమ్‌ స్వాప్ టెక్నాలజీ ద్వారా చాలా సులభంగా డబ్బులు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైకి చెందిన షా టెక్స్‌టైల్ వ్యాపారి. గత నెల 27న అర్ధరాత్రి అతడి ఫోన్ నంబరుకు ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఉదయం లేచాక వచ్చిన నంబర్లకు ఫోన్ చేస్తే సిమ్ బ్లాక్ అయింది.

సిమ్ బ్లాక్ కావడంతో విషయం తెలుసుకుందామని సర్వీస్ ప్రొవైడర్‌కు షా ఫోన్ చేస్తే.. మీ రిక్వెస్ట్‌తోనే సిమ్‌ను బ్లాక్ చేసి కొత్త సిమ్ ఇచ్చినట్టు చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అనుమానం వచ్చిన ఆయన వెంటనే బ్యాంకుకు వెళ్లి ఖాతాలను పరిశీలిస్తే అప్పటికే రూ. 1.86 కోట్లు మాయం అయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 14 ఖాతాలకు డబ్బు బదిలీ అయినట్టు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో లబోదిబోమన్నాడు. బ్యాంకు సిబ్బంది చాకచక్యంతో రూ. 20 లక్షలు వెనక్కి వచ్చినా మిగతా సొమ్మును అప్పటికే డ్రా చేసేశారు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. షా సిమ్ నంబరును యాక్సెస్ చేసుకున్న మోసగాళ్లు సిమ్ స్వాప్ టెక్నాలజీ ద్వారా ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డిసెంబరు 27న రాత్రి 11:15 గంటలకు షా నుంచి తమకు సిమ్ స్వాప్ రిక్వెస్ట్ వచ్చినట్టు సర్వీస్ ప్రొవైడర్ చెబుతున్నారు. సిమ్ స్వాప్ ద్వారా మోసగాళ్లు కొత్త నంబరు తీసుకుంటారు. అది యాక్టివేట్ అయ్యాక ఓటీపీ నంబర్లన్నీ దానికే వస్తుంటాయి. అలా మోసగాళ్ల పని సులభం అవుతుంది. బ్యాంకు ఖాతాల నంబర్లు, బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ముందే హ్యాక్ చేసి పెట్టుకునే మోసగాళ్లు సిమ్ చేతికి అందిన వెంటనే పని  ప్రారంభిస్తారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News