Telangana: నా ఓటమికి దయానందే కారణం.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ కు చెబుతా!: పిడమర్తి రవి
- సత్తుపల్లిలో నాకు సహకరించలేదు
- టీడీపీకి ఆయన కోవర్టుగా పనిచేశారు
- కేసీఆర్, కేటీఆర్ ను మరోసారి కలుస్తా
తెలంగాణలోని సత్తుపల్లి టీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ముదిరాయి. తాజాగా టీఆర్ఎస్ నాయకుడు మట్టా దయానంద్ విజయకుమార్ పై ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దయానంద్ టీడీపీకి కోవర్టుగా పనిచేశారని ఆరోపించారు. ఆయన్ను వెంటనే టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పిడమర్తి రవి.. ఈ ఎన్నికల్లో దయానంద్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు తనకు సహకరించలేదని తెలిపారు. వీరి వ్యవహారశైలిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే మరోసారి వీరిద్దరినీ కలిసి దయానంద్ సహా పార్టీ వ్యతిరేకుల గురించి వివరిస్తానని పేర్కొన్నారు.
సత్తుపల్లి టికెట్ ఆశించిన దయానంద్... తనకు అభ్యర్థిత్వం దక్కకపోవడంతో నిరసన గళం వినిపించారు. ఓ దశలో అటు పిడమర్తి, ఇటు దయానంద్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్ వారిద్దరినీ హైదరాబాద్ కు పిలిపించుకుని శాంతింపజేశారు. అప్పటి నుంచి నేతలిద్దరూ ప్రచారంలో ఐక్యంగానే కనిపించారు. ప్రజా కూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య చేతిలో పిడమర్తి రవి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.