Andhra Pradesh: జనసేన పార్టీతో పొత్తుపై స్పందించిన సీపీఐ నేత నారాయణ!
- చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది
- అందుకే పవన్ ను ఆహ్వానిస్తున్నారు
- కేరళలో బీజేపీ, ఆరెస్సెస్ రాద్ధాంతం చేస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ అంసెబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి ముందుకు వెళతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే ఆయన పవన్ కల్యాణ్ ను పొత్తు కోసం ఆహ్వానిస్తున్నారని నారాయణ విమర్శించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిన్నటి వరకూ పవన్ కల్యాణ్ ను విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనతోనే పొత్తు పెట్టుకుంటామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోదీ దేశంలోని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును మాత్రమే కేరళ ప్రభుత్వం అమలు చేస్తోందనీ, దీనిపై కావాలనే బీజేపీ, ఆరెస్సెస్ రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు.