India: 622 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసిన భారత్!
- 81 పరుగులు చేసి అవుట్ అయిన జడేజా
- క్రీజ్ లో నాటౌట్ గా 159 పరుగులతో నిలిచిన పంత్
- చివర్లో ఉరుకులు, పరుగులు పెట్టిన స్కోర్
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 622 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 81 పరుగులు చేసిన జడేజా లియాన్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోవడంతో ఆ వెంటనే ఇన్నింగ్స్ ను ముగిస్తున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. క్రీజులో పాతుకుపోయిన రిషబ్ పంత్ 159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు పంత్, జడేజాలు కలిసి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విరుచుకుపడ్డారు. ఓవర్ కు 7 పరుగులకు పైగా రన్ రేట్ తో స్కోర్ బోర్డును ఉరుకులు పెట్టించారు.
దీంతో స్కోర్ చూస్తుండగానే 600 పరుగులు దాటేసింది. ఆపై జడేజా సెంచరీ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు కనిపించగా, అతను అవుట్ కావడంతో, వెంటనే డిక్లేర్ చేశారు. ఈ ఇన్నింగ్స్ లో భారత్ 7 వికెట్లను కోల్పోగా, నిరాశపరిచింది ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే. మయాంక్ అగర్వాల్ 77, పుజారా 193, కోహ్లీ 23, రహానే 18, హనుమ విహారి 42, రిషబ్ పంత్ 159, జడేజా 81 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ కు 4 వికెట్లు దక్కగా, హాజిల్ వుడ్ 2, స్టార్క్ 1 వికెట్ పడగొట్టారు. మరికాసేపట్లో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా వచ్చి, ఓ టెస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు.