ayodhya: అయోధ్య కేసు కోర్టులో ఉంది.. ఏమీ మాట్లాడను: రాహుల్ గాంధీ
- అయోధ్య కేసును నేడు విచారించిన సుప్రీంకోర్టు
- తదుపరి విచారణ 10వ తేదీకి వాయిదా
- కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ మాట్లాడనని చెప్పిన రాహుల్
అయోధ్య రామ మందిరం కేసు విచారణను కొత్త ధర్మాసనానికి అప్పగించబోతున్నట్టు ఈరోజు సుప్రీంకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కే కౌల్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును నేడు విచారించింది. ఇరుపక్షాల తరపున వాదనలను వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, రాజీవ్ ధావన్ లు కోర్టుకు హాజరయ్యారు. అయితే, వారి వాదనలను వినకుండానే... జనవరి 10కు తదుపరి విచారణను వాయిదా వేశారు. ఒక్క నిమిషం పాటు కూడా కేసు విచారణ సాగలేదు.
మరోవైపు, ఈ అంశంపై స్పందించాలంటూ మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కోరారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని... అందువల్ల దీనిపై తాను ఏమీ మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు.