KTR: ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుకు కారణం ఇదే: కేటీఆర్
- ట్రక్కు గుర్తు వల్లే ఉత్తమ్ గెలుపొందారు
- ఉత్తమ్ అంతటి అహంకారి మరెవరూ లేరు
- పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే స్థితిలో కాంగ్రెస్ లేదు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఉత్తమ్ కు చాలా అహంకారం ఉందని అన్నారు. ట్రక్కు గుర్తు వల్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందారని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో మహామహులు మట్టికరిచారని చెప్పారు. జానారెడ్డి కూడా ఓటమిపాలయ్యారని తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశాలకు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎన్నడూ హాజరు కాలేదని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ప్రజలు తరిమికొడితే... కాంగ్రెస్ నేతలు ఆయనను మళ్లీ పట్టుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన రూ. 500 కోట్లతో కాంగ్రెస్ నేతలు కుట్రలకు పాల్పడ్డారని మండిపడ్డారు. 2014లో 63 సీట్లు గెలిస్తే... ఇప్పుడు 88 సీట్లు గెలిచామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని చెప్పారు.