aam admi man: ఆయన ఆమ్ ఆద్మీ మ్యాన్ కాదు.. అంబానీ, అదానీ మ్యాన్: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
- బోఫోర్స్ కు ఎన్నో రెట్లు ఎక్కువ కుంభకోణం ‘రాఫెల్’
- ఈ వ్యవహారంలో ప్రధాని ప్రమేయం డైరెక్టుగా ఉంది
- 2019లో బీజేపీ గ్రాఫ్ ఎక్కడికి పడిపోతుందో!
బోఫోర్స్ కుంభకోణం ఆరోపణ నాడు కాంగ్రెస్ పార్టీని, మిస్టర్ క్లీన్ లాంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని పడగొట్టేసిందని ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, బోఫోర్స్ అనేది కేవలం ఓ ఆరోపణ, ఇది రూ.62 కోట్లకు సంబంధించిన ఆరోపణ అని నాడు ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. బోఫోర్స్ కు ఎన్నో వందల రెట్లు ఎక్కువ కుంభకోణం ‘రాఫెల్’ అని, ఈ వ్యవహారంలో ప్రధాని ప్రమేయం డైరెక్టుగా ఉందన్న విషయం తెలిసిపోతోందని అన్నారు.
గతంలో మోదీపై ‘చాయ్ వాలా’ అనే అభిప్రాయం ఉండేదని, ఆ అభిప్రాయం పోయి ‘బూట్ వాలా సూట్ వాలా’ అని, అలాగే, ‘ఆమ్ ఆద్మీ మ్యాన్’ కాస్తా పోయి ‘అదాని, అంబానీ మ్యాన్’ అన్న అభిప్రాయం వచ్చేసిందని విమర్శించారు. కచ్చితంగా, 2019లో బీజేపీ గ్రాఫ్ ఎక్కడికి పడిపోతుందో కూడా చెప్పలేమని అన్నారు.
నాడు ‘బోఫోర్స్’ ఆరోపణ తమ ప్రభుత్వాన్ని కూల్చేందని.. ‘బోఫోర్స్’కు ఎన్నో వందల రెట్లు ఎక్కువైన ‘రాఫెల్’తో బీజేపీకి ఓటమిపాలు తప్పదని అభిప్రాయపడ్డారు. రాఫెల్ కుంభకోణంపై జేపీసీ వేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదని తులసిరెడ్డి విమర్శించారు.