KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ?
- కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో తొలి అడుగు
- గుత్తా సుఖేందర్‌రెడ్డికి కేబినెట్లో చోటు
- ఆ స్థానం నుంచి కేసీఆర్ పోటీ
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.
లోక్‌సభ ఎన్నికల విషయంలో కేసీఆర్‌కు అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉంది. తొలిసారి 2004లో కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలిచిన కేసీఆర్, 2006, 2008లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు. 2014లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతోపాటు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన రెండు స్థానాల్లోనూ విజయ బావుటా ఎగురవేశారు. అయితే, లోక్‌సభ స్థానాన్ని వదులుకుని గజ్వేల్‌ను అట్టేపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్‌కు మెదక్‌లో 6,57,492 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే చెందిన కె.ప్రభాకర్ రెడ్డి 5,71,800 ఓట్లతో విజయం సాధించారు.
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 16 స్థానాలను సొంతం చేసుకోవాలని భావిస్తున్న కేసీఆర్ ఆయనే నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. పార్టీ వర్గాల కథనం ప్రకారం.. సుఖేందర్‌రెడ్డికి కేబినెట్లో స్థానం కల్పించడం ద్వారా నల్గొండ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించిన కేసీఆర్ ఆ దిశగా వెళ్లేందుకు ఇది మొదటి అడుగని చెబుతున్నారు.