Andhra Pradesh: హైదరాబాద్ తో ఉన్న 30-40 ఏళ్ల అనుబంధాన్ని ఉద్యోగులు వదులుకున్నారు!: సీఎం చంద్రబాబు

  • జన్మభూమిలో ఫిర్యాదులు సగానికి తగ్గాయి
  • ఉద్యోగుల సొంతింటి కలను నెరవేరుస్తాం
  • అమరావతిలో సీఎం టెలీకాన్ఫరెన్స్

జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈసారి ఫిర్యాదుల సంఖ్య సగానికి తగ్గిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రం ముందుకు దూసుకెళ్లడానికి ప్రజలు, ఉద్యోగులే కీలకమనీ, వీరిద్దరూ ప్రగతి రథ చక్రాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తో 30-40 ఏళ్ల అనుబంధం ఉన్నప్పటికీ ఉద్యోగులు, లాయర్లు ఏపీకి తరలివచ్చారని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై ఈరోజు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏపీలోని ఉద్యోగుల సొంతింటి కలను నెరవేరుస్తామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి అర్థాంతరంగా వచ్చిన ఉద్యోగులు, న్యాయవాదులు నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల కోసం ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా అపార్ట్ మెంట్లు నిర్మించి ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు. ఏపీ తీవ్ర ఆర్థికలోటుతో సతమతం అవుతున్నప్పటికీ రైతులకు రూ.24,000 కోట్ల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. అలాగే రూ.4,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామనీ, మరో రూ.4 వేల కోట్లకు పంట ఉత్పత్తులను కొన్నామని సీఎం అన్నారు.

కౌలు రైతులకు రూ.9,100 కోట్ల రుణాలు ఇచ్చామనీ, ఇది దేశంలోనే రికార్డని వ్యాఖ్యానించారు. గత 64 ఏళ్లుగా సతమతం అవుతున్న చుక్కల భూమి సమస్యను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనివల్ల రైతులు తమ భూములను ఇతరులకు అమ్ముకోలేక, ఈ భూములను కొనలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News