Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ‘నారా రాజ్యాంగం’ నడుస్తోందని చంద్రబాబు అనుకుంటున్నారు!: రోజా ఎద్దేవా
- ఎన్ఐఏ విచారణకు ఎందుకు భయపడుతున్నారు
- హైకోర్టు ఆదేశాలను సీఎం పాటించడం లేదు
- హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతపై దాడి జరిగిన గంటలోనే డీజీపీ ఠాకూర్ ఆయన అభిమానే ఈ దాడి చేశారంటూ అబద్ధాలు చెప్పారని వైసీపీ నేత రోజా ఆరోపించారు. అనంతరం కొద్ది గంటల్లోనే టీడీపీ నేతలు నిందితుడు శ్రీనివాసరావు-జగన్ ఫొటోలతో నకిలీ ప్లెక్సీలను రూపొందించారని విమర్శించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరగడం తన వైఫల్యం అన్న విషయం మర్చిపోయిన సీఎం చంద్రబాబు మీడియాతో హేళనగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు.
సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ జగన్ పై హత్యాయత్నం చేయించకుంటే.. కేసును ఎన్ఐఏకు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు. ప్రజలకు చట్టాలు తెలియవు కాబట్టి మనం ఏం చేసినా నమ్మేస్తారు అనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారని దుయ్యబట్టారు.
చట్టప్రకారం హైకోర్టు ఆదేశాలతో జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు కేంద్రం అప్పగించిందని స్పష్టం చేశారు. కానీ ఈ వ్యవహారంలో చంద్రబాబు తీరు మాత్రం ‘ఈ 13 జిల్లాలకు భారత రాజ్యాంగం వర్తించదు. ఇక్కడ నారా రాజ్యాంగం నడుస్తోంది’ అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏపీని దొంగలకు, ఆర్థిక నేరగాళ్లకు అడ్డాగా చంద్రబాబు మారుస్తున్నారని రోజా విమర్శించారు.