Haryana: స్నేహితురాలిని పెళ్లాడేందుకు పది లక్షలతో యువతి లింగమార్పిడి.. మూడు నెలల కాపురం తర్వాత వద్దు పొమ్మన్న భార్య!
- హరియాణాలో ఘటన
- గతేడాది అక్టోబరులో వివాహం
- చట్టపరంగా ముందుకెళ్తామన్న యువకుడి కుటుంబ సభ్యులు
చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితురాలిని పెళ్లాడేందుకు 21 ఏళ్ల యువతి లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారింది. మూడు నెలల కాపురం తర్వాత భర్తకు షాకిచ్చిందా భార్య. తాను అతడితో కలిసి ఉండేది లేదని తేల్చిచెప్పడంతో ఏం చేయాలో తెలియని ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. గతేడాది అక్టోబరులో ఢిల్లీలోని ఓ ఆలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తాజాగా భర్తగా మారిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తన భార్యను ఆమె తల్లిదండ్రులు ఇంట్లో బంధించారని, తనను కలిసేందుకు అనుమతించడం లేదని ఫిర్యాదు చేశాడు. తాము చదువకున్నప్పుడే ప్రేమలో పడ్డామని, అప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అయితే, స్వలింగ వివాహానికి పెద్దలు నిరాకరించారని పేర్కొన్నాడు.
తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో లింగమార్పిడి చేయించుకోవాలని వారిలో ఒకరు నిర్ణయించుకున్నట్టు యువకుడిగా మారిన వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడాది క్రితం ఢిల్లీలో పది లక్షల రూపాయల ఖర్చుతో లింగమార్పిడి చేయించుకున్నాడని, ఇందుకోసం తెలిసిన వారి వద్ద డబ్బులు అప్పు తెచ్చినట్టు తెలిపారు. లింగ మార్పిడి అనంతరం గతేడాది అక్టోబరులో ఢిల్లీలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నట్టు వివరించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తాను అతడితో ఉండాలనుకోవడం లేదని భార్య చెప్పడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
ఇద్దరూ మేజర్లేనని పేర్కొన్న ఎస్పీ స్మితి చౌదరీ వారికి నిర్ణయం తీసుకునే హక్కు ఉందన్నారు. తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను భర్త తమకు చూపించినట్టు చెప్పారు. అయితే, భార్య ఇప్పుడు అతడితో ఉండేందుకు అంగీకరించడం లేదని, తల్లిదండ్రులతోనే ఉంటానని చెబుతోందని ఎస్పీ వివరించారు. ఆమె మేజర్ కావడంతో నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉందని పేర్కొన్నారు. ఈ కేసును మూసివేయడం తప్ప మరో మార్గం లేదని పోలీసులు తెలిపారు. అయితే, ఇద్దరినీ కలిపేందుకు తాము చట్టపరంగా ముందుకెళ్తామని యువకుడి కుటుంబ సభ్యులు తెలిపారు.