Uttar Pradesh: అవినీతికి అడ్డుకట్ట వేయకపోతే ప్రజల మూడ్ మారిపోయే అవకాశం ఉంది... సీఎం యోగికి లేఖ రాసిన సొంతపార్టీ ఎమ్మెల్యే
- సంభాల్ జిల్లా అధికారుల్లో పెచ్చుమీరుతున్న అవినీతి
- రూ. 200 విలువైన డస్ట్ బిన్ రూ. 12 వేలా?
- ప్రజల మూడ్ మారకముందే చర్యలు తీసుకోండి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చారు. సంభాల్ జిల్లాలోని అధికారుల్లో అవినీతి పెచ్చుమీరుతోందని, వారిని నియంత్రించాలంటూ గున్నౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజీత్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. ‘‘జిల్లాలోని అవినీతి అధికారుల భరతం పట్టండి. అవినీతికి అడ్డుకట్ట వేయకపోతే ప్రజల మూడ్ మారిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా నష్టపోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అజిత్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. సంభాల్ జిల్లా అధికారుల్లో చాలామంది అవినీతిపరులేనని ఆరోపించారు. రూ.200 విలువైన చెత్త బుట్టలను రూ. 12 వేలు పెట్టి కొనుగోలు చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక, చాలా గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్లే లేకున్నా ప్రజలకు బిల్లులు మాత్రం పంపిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.