Mayank Agarwal: నా కోరికలకి ఇంట్లో వాళ్లు ఎలాంటి అడ్డూ చెప్పలేదు!: క్రికెటర్ మయాంక్ అగర్వాల్
- ఆస్ట్రేలియా టూర్లో రాణిస్తున్న మయాంక్
- పైలెట్ కావాలన్నది చిన్నప్పటి కల
- ఇక నెరవేరుతుందన్న నమ్మకం లేదు
మయాంక్ అగర్వాల్.. ఈ పేరు ప్రస్తుతం భారత క్రికెట్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఈ యువ బ్యాట్స్ మెన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఏ మాత్రం భయం లేకుండా తన బ్యాటింగ్ తో సత్తా చూపిస్తున్నాడు. ఇక భవిష్యత్తులో టీమ్ ఇండియాలో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి మయాంక్ అగర్వాల్ సిద్ధం అవుతున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా మయాంక్ తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తనకి చిన్ననాటి కల ఒకటి ఉండిపోయింది అని, దానిని తీర్చుకోలేకపోయానని చెప్పుకొచ్చిన మయాంక్ దాని వెనుక కథ కూడా చెప్పుకొచ్చాడు.
'నాకు చిన్నప్పటి నుంచి విమానాలు అంటే పిచ్చి. దీంతో సైన్స్ చదివి పైలెట్ కావాలని అనుకున్నా. తరువాత క్రికెటర్ కావాలని అనుకున్నాను. మొదటిగా పైలెట్ కావాలని నా నిర్ణయం చెప్పినపుడు మా ఇంట్లో ఎలాంటి అడ్డు చెప్పలేదు. తరువాత క్రికెటర్ అవుతా అని చెప్పినపుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. ప్రస్తుతం క్రికెటర్ గా సత్తా చాటుతూ ముందుకెళ్తున్న నేను పైలెట్ కావాలనే చిన్నప్పటి కలని మాత్రం నెరవేర్చుకోలేకపోయా. అది తీరుతుందనే నమ్మకం కూడా ఇక ప్రస్తుతం లేదు' అని మయాంక్ అగర్వాల్ తన చిన్నప్పటి డ్రీమ్ గురించి చెప్పుకొచ్చాడు.