india: దేశ అభివృద్ధి కంటే ఏపీ ఎక్కువగా అభివృద్ధి సాధించింది: సీఎం చంద్రబాబునాయుడు
- పునాదిపాడులో ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమం
- ఏపీలో 11 శాతం వృద్ధి నమోదు చేశాం
- టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి ఆర్థికాభివృద్ధి చేస్తున్నాం
దేశ అభివృద్ధి కంటే ఏపీ ఎక్కువగా అభివృద్ధి సాధించిందని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పునాదిపాడులో ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీలో 11 శాతం వృద్ధి నమోదు చేశామని, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి ఆర్థికాభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలో భూగర్భ జలాలు పడిపోయిన పరిస్థితి గతంలో ఉండేదని, భూగర్భ జలాలు ఉప్పుగా మారి తాగడానికి నీరులేని పరిస్థితి ఉండేదని అన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి-కృష్ణా అనుసంధానం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని, ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు అధిక పంటలు పండించి ఆదాయం పొందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం కృష్ణా జిల్లాదేనని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని అవార్డులు ఇస్తున్నారని, 62 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టగా 17 ప్రాజెక్టులు పూర్తి చేశామని, మరిన్ని ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కృష్ణా జిల్లాలో చింతలపూడి పథకాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.