amaravathi: అమరావతిని రోజుకి మూడు వేల మంది సందర్శిస్తున్నారు: మంత్రి నారాయణ
- రాష్ట్ర రాజధాని గొప్ప పర్యాటక కేంద్రంగా మారింది
- చూడదగ్గ ప్రదేశాలు లేకపోతే ఇది సాధ్యమా
- తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీకి గుణపాఠం తప్పదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గొప్ప పర్యాటక కేంద్రంగా మారిందని, రోజుకి సగటున మూడు వేల మంది సందర్శిస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. ఎటువంటి అభివృద్ధి లేకుండా, చూడదగ్గ ప్రాంతం కాకుంటే ఇలా వస్తారా? అని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణంలో వేగం పెరిగిందని, నాలుగు వేల అపార్ట్మెంట్ల నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చిందని చెప్పారు.
సివిల్ కోర్టు భవనాల నిర్మాణం పూర్తయిందని. హైకోర్టు భవనం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 50 అంతస్తులతో సచివాలయం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 1600 కిలోమీటర్ల రోడ్ల పనులు, 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వానికి ఇవేవీ కనిపించడం లేదని, అందుకే కేసీఆర్, జగన్తో తప్పుడు ప్రచారం చేయిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదని జోస్యం చెప్పారు.