Tamilnadu: ప్రియుడిని బెదిరించి.. డిగ్రీ విద్యార్థినిపై రైల్వేస్టేషన్‌లో అత్యాచార యత్నం!

  • చెన్నైలోని ఎంఆర్‌టీఎస్‌ స్టేషన్‌లో ఘటన
  • గతంలోనూ ఇటువంటి సంఘటనలతో భద్రత పెంచిన పోలీసులు
  • తాజా ఘటనతో మహిళల్లో మళ్లీ ఆందోళన

ప్రియుడితో కలిసి మాట్లాడుకుంటున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఓ యువతిని బెదిరించి ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి అత్యాచార యత్నం చేసిన ఘటన చెన్నైలోని ఎంఆర్‌టీఎస్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే స్టేషన్‌ బుకింగ్‌ క్లర్క్‌, మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ ఇటువంటి సంఘటనలు ఈ స్టేషన్‌లో చోటుచేసుకోగా పోలీసులు భద్రత పెంచారు.

అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో తాజా సంఘటనతో స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగించే మహిళలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే...కేరళ రాష్ట్రానికి చెందిన ఓ యువతి చెన్నైలోని మైలాపూర్‌లోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతూ స్థానికంగా ఉన్న లేడీస్‌ హాస్టల్‌లో ఉంటోంది. తోటి విద్యార్థితో ఆమె ప్రేమలో పడింది. దీంతో ఇద్దరూ తరచూ తరమణిలోని ఎంఆర్‌టీఎస్‌ రైల్వే స్టేషన్‌లో కూర్చుని మాట్లాడుకోవడం అలవాటు.

శనివారం రాత్రి 10.30 గంటల సమయంలోనూ వీరు ఇలాగే మాట్లాడుకుంటూ ఉండగా స్టేషన్‌ రైల్వే బుకింగ్‌ క్లర్క్‌ లోకేశ్వరన్‌ (22), లిఫ్ట్‌ ఆపరేటర్లు లూకాస్‌, శ్రీరామ్‌లు వారి వద్దకు వచ్చారు. రాత్రిపూట ఇక్కడ ఉండడం నేరమని వారిని బెదిరించారు. అనంతరం ఆ యువకుడిని బలవంతంగా బయటకు పంపించేసి విచారణ పేరుతో యువతిని స్టేషన్‌ మొదటి అంతస్తుకు తీసుకువెళ్లారు. రాత్రిపూట అలా ఉండడం నేరమని, ఐదు వేల రూపాయలు జరిమానా చెల్లించాలన్నారు. తన వద్ద అంత డబ్బులేదని ఆమె చెప్పడంతో తమ కోర్కె తీర్చాలంటూ బలవంతం చేశారు. ఆమె అంగీకరించక పోవడంతో అత్యాచార యత్నం చేశారు.

దీంతో బెదిరిపోయిన ఆ యువతి గట్టిగా కేకలు వేస్తూ వారిని తోసేసి పరుగందుకుంది. స్టేషన్‌ బయట నిల్చుని ఉన్న కానిస్టేబుల్‌కు జరిగింది చెప్పింది. ఆ కానిస్టేబుల్‌ తిరువాన్మియూర్‌ పోలీసులకు సమాచారమందించారు. ఈలోగా సమాచారం అందుకున్న ఎగ్మూరు రైల్వే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధిత యువతి వద్ద ఫిర్యాదు తీసుకున్నారు.

అనంతరం లైంగిక వేధింపులు, అత్యాచార యత్నం ఆరోపణలపై కేసు నమోదుచేసి నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. కాగా రాత్రయితే ఎంఆర్‌టీఎస్‌ రైల్వేస్టేషన్లలో మహిళలకు భద్రత కరువవుతోందని, గతంలోనూ స్టేషన్‌లో ఓ మహిళపై అత్యాచార యత్నం జరిగిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. అన్ని స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉందని, భద్రత పటిష్టం చేయాలని మహిళలు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News