central government: కేంద్రం తీసుకొస్తున్న ఈబీసీ రిజర్వేషన్లకు టీడీపీ వ్యతిరేకం కాదు: సుజనా చౌదరి
- ఎలాంటి అధ్యయనం లేకుండా నిర్ణయం తీసుకున్నారు
- కేంద్ర నిర్ణయంపై అధ్యయనం చేసి స్పందిస్తాం
- రేపు ఆ బిల్లును ఎలా ఆమోదించుకుంటారు?
అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పలు పార్టీల నేతలు స్పందిస్తున్నారు. తాజాగా, ఏపీ టీడీపీ నేత సుజనా చౌదరి మాట్లాడుతూ, కేంద్రం తీసుకొస్తున్న ఈబీసీ రిజర్వేషన్లకు టీడీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే, ఎలాంటి అధ్యయనం లేకుండా హడావుడిగా రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈబీసీ రిజర్వేషన్లపై కేంద్ర నిర్ణయంపై అధ్యయనం చేసి స్పందిస్తామని చెప్పారు. ఈరోజు నిర్ణయం తీసుకుని, రేపు ఆ బిల్లును సభలో పెట్టి ఎలా ఆమోదించుకుంటారని ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఉండాలని సూచించారు.
అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకున్న కేంద్రం, వాటిని ఎలా అమలు చేస్తారన్న విషయంలో వివరణ ఇవ్వలేదని అన్నారు. రాజకీయ లబ్ది కోసం రిజర్వేషన్లు పెంచకూడదని సుజనా చౌదరి సూచించారు.