USA: జమాల్ అల్ బడావీని మట్టుబెట్టాం: అమెరికా
- జనవరి 1న యూఎస్ ఎయిర్ ఫోర్స్ దాడులు
- అల్ ఖైదా ముఖ్యనేతను చంపేశామన్న యూఎస్
- టీమ్ ను అభినందించిన డొనాల్డ్ ట్రంప్
ఒసామా బిన్ లాడెన్ తరువాత, ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాను నడిపిస్తున్న ముఖ్య నేత జమాల్ అల్ బడావీని మట్టుబెట్టామని అమెరికా వెల్లడించింది. తాము చేపట్టిన వాయుసేన దాడుల్లో ఆయన మరణించాడని స్పష్టం చేసింది. అల్ ఖైదా తరఫున యెమెన్ లో కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న బడావీ, 2000 సంవత్సరంలో యూఎస్ నేవీపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కీలకపాత్ర పోషించాడు. నాటి దాడిలో 17 మంది మరణించగా, 40 మందికి గాయాలు అయ్యాయి.
బడావీ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 35 కోట్లు) పారితోషికం ఇస్తామని కూడా అమెరికా ప్రకటించింది. తాజాగా, జనవరి 1న మారిబ్ గవర్నేట్ లో తమ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించగా, జమాల్ అల్ బడావీ మరణించాడని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారి బిల్ అర్బన్ వెల్లడించారు. కాగా, బడావిని మట్టుబెట్టిన బృంద సభ్యులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. అల్ ఖైదాకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.