Uttar Pradesh: అమ్మవారి గుడిలో ఆహారంతోపాటు మద్యం పంపిణీ.. యూపీ బీజేపీ ఎమ్మెల్యే నితిన్ వర్గం నిర్వాకం
- పిల్లలకు కూడా అవే ప్యాకెట్లు ఇవ్వడంతో విమర్శలు
- ఉత్తరప్రదేశ్ లోని శ్రావణదేవి ఆలయం పాసీ సమ్మేళన్‌లో ఘటన
- ఎమ్మెల్యే, ఆయన తండ్రి తీరును తప్పుపట్టిన స్థానిక ఎంపీ
సామాజిక సమ్మేళనం పేరుతో దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆహారంతోపాటు మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్‌లోని శ్రావణదేవి ఆలయంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానిక బీజేపీ పెద్దలు ఇరుకున పడ్డారు.
వివరాల్లోకి వెళితే... బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఆలయంలో ‘పాసి సమ్మేళన్’ జరిగింది. ఆయన ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీని వీడి కమలనాథుల పంచన చేరారు. పార్టీ మారిన సందర్భంగా తన అభిమానులు, అనుచరులు, పార్టీ నేతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ ప్యాకెట్లు తెరిస్తే అందులో ఆహారంతోపాటు మద్యం బాటిళ్లు కూడా ఉండడంతో కొందరు షాకయ్యారు.
ముఖ్యంగా పిల్లలకు పంచిపెట్టిన ప్యాకెట్లలోనూ ఇవి దర్శనమివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పైగా గ్రామంలోని తమ వర్గం వారికి ఈ ప్యాకెట్లను తప్పక పంపిణీ చేయాలని నితిన్ చెబుతున్నట్లున్న వీడియో ఒకటి బయటపడడం మరింత వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై స్థానిక ఎంపీ అన్షుల్ వర్మ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు గతంలో బీజేపీ నాయకులు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసేవారని, ఇలా మద్యం పంపిణీ చేయడం ఏమిటంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు.
బీజేపీపై దుష్ప్రచారం జరగాలన్న ఉద్దేశంతోనే నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా నితిన్‌ను పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ నాయకులు మరోసారి ఆలోచించాలని కోరారు. అయితే నితిన్ తండ్రి నరేష్ అగర్వాల్‌ను దోషిని చేయడం ద్వారా బీజేపీ ఈ వివాదం నుంచి బయటపడాలని చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంత జరిగినా, ఈ ఘటనపై నితిన్‌గాని, ఆయన తండ్రి నరేష్‌గాని నోరు మెదపక పోవడం గమనార్హం.