Nalgonda District: పదో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని.. గుక్కపట్టి ఏడుస్తున్నా పాలివ్వని కన్న(కసాయి) తల్లి!
- చిన్నారిని కన్నెత్తి చూడని తల్లి, కుటుంబ సభ్యులు
- పాలు కోసం ఏడుస్తున్నా కనిపించని కరుణ
- పాపను విక్రయించేందుకు ప్రయత్నం
- అడ్డుకున్న పోలీసులు
ఇప్పటికే ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నా మరో అబ్బాయి కోసం ప్రయత్నించారా తల్లిదండ్రులు. అయితే, మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో వారంతా ఆ నవజాత శిశువుకు శత్రువులుగా మారిపోయారు. బిడ్డ ఎలా ఉందో చూసేందుకు కన్న తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. బిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్నా పాలిచ్చేందుకు నిరాకరించిందా తల్లి. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చందంపేట మండలం మోత్య తండాకు చెందిన ఇస్లావత్ సావిత్రి-రాజు దంపతులకు ఇప్పటికే 9 మంది సంతానం. మంగళవారం ఉదయం సావిత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పదో బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింది అమ్మాయి అని తెలుసుకున్న దంపతులు, చిన్నారి అమ్మమ్మ రాములమ్మలు బిడ్డను చూసేందుకు కూడా నిరాకరించారు. చిన్నారి ఏడుస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు. పాలిచ్చేందుకు ముందుకు రాలేదు. బిడ్డ ఏడుపుకు చలించిపోయిన చుట్టుపక్కలవారు వారిని మందలించారు. పాలుపట్టాలని చెప్పినా తల్లి ముందుకు రాలేదు. చివరికి వారే పోతపాలు పట్టి చిన్నారి ఆకలి తీర్చారు.
మరోవైపు, బిడ్డను విక్రయించేందుకు చిన్నారి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు తెలియడంతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ వెంకటమ్మ ఆసుపత్రికి చేరుకుని మందలించారు. చిన్నారి కనిపించకపోయినా, ఆమెకేమన్నా జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బిడ్డ తండ్రి రాజు వెంకటమ్మతో వాగ్వివాదానికి దిగాడు. కేసు పెట్టుకోవాలని సూచించాడు. చివరికి పోలీసుల జోక్యంతో చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు వారు అంగీకరించారు.