India: ‘అగ్రవర్ణాలకు రిజర్వేషన్’ బిల్లుపై రాజ్యసభలో చర్చ.. సెలక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాలు!
- విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు
- బిల్లుపై చర్చ జరగాలన్న కాంగ్రెస్ పార్టీ
- గందరగోళంతో వాయిదాపడ్డ రాజ్యసభ
అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఈబీసీ బిల్లు-2018ను కేంద్రం ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టింది. నిన్న ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై చర్చ జరిపేందుకు 3 గంటల సమయం ఇస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో కీలకమైన బిల్లుపై ఇంత తక్కువ సమయం సరిపోదంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి.
ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసం చేయడం ఆపాలని ఈ సందర్భంగా డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. బిల్లుకు తాను సవరణ ప్రతిపాదిస్తున్నట్లు డీఎంకే సభ్యురాలు కనిమొళి ప్రకటించగా, చైర్మన్ అందుకు అంగీకరించలేదు. దీంతో బిల్లును వెంటనే సెలెక్ట్ కమిటీకి పంపాలని డీఎంకే, సీపీఐ డిమాండ్ చేశాయి.
కాగా, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే బిల్లును ఈరోజే ఆమోదించాల్సిన అవసరం లేదనీ, దీనిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ బిల్లుపై చర్చకు దూరంగా ఉండాలని బిహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాజ్యసభను ఒకరోజు పొడిగించడంపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. చివరికి సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.