EBC Reservations: రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చేది ఇలాగేనా?: సీపీఐ ఎంపీ రాజా మండిపాటు
- ఈబీసీ రిజర్వేషన్ బిల్లుపై వాడీవేడీగా చర్చ
- రాజకీయపరమైన కారణాలతోనే ఈ బిల్లును తెచ్చారు
- ఈ ప్రభుత్వానికి శ్రామిక, కార్మిక వర్గాల గురించి పట్డదు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈబీసీ రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు విధానం సరిగా లేదని, ప్రతి పౌరుడినీ ఆందోళనకు గురి చేసేలా ఉందని సీపీఐ ఎంపీ డి.రాజా మండిపడ్డారు. రాజ్యసభలో ఈబీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చ వాడీవేడీగా జరిగింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, ప్రభుత్వం చేసిన పని రాజ్యాంగం, పార్లమెంట్ స్థాయికి తగ్గట్టు లేదని, రాజకీయపరమైన కారణాలతోనే ఈ బిల్లును తీసుకొచ్చిందని ఘాటు విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వానికి శ్రామిక, కార్మిక వర్గాల గురించి పట్టదని, కేవలం, కార్పొరేట్ వర్గాల వారి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.
ఆదాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడమనేది శాసన స్ఫూర్తికి విరుద్ధమని చెబుతూ, ఏ పరిస్థితుల్లో రిజర్వేషన్లు కల్పించాలో అంబేద్కర్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చాలా కాలంగా దోపిడీ, అణచివేతలకు గురైన వారికే రిజర్వేషన్లు ఉండాలని అంబేద్కర్ చెప్పారని, ఈబీసీ బిల్లు విషయంలో మీరు దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.