Praneet choudary: బీటెక్‌ను మధ్యలోనే మానేసి లండన్ వెళ్లి.. చివరికి దొంగగా మారిన ప్రణీత్ చౌదరి
- లండన్‌లో దౌత్యపరమైన నేరం
- ఢిల్లీకి తిప్పి పంపిన లండన్ పోలీసులు
- డబ్బుల కోసం ఢిల్లీలో నేరాలు మొదలు
వరుస గొలుసు దొంగతనాలతో సంచలనం సృష్టించిన కేసులో కీలక నిందితుడైన ముఠానాయకుడు ప్రణీత్ చౌదరికి పెద్ద చరిత్రే ఉంది. హైదరాబాద్‌కు చెందిన చింతమళ్ల ప్రణీత్‌చౌదరి బీటెక్ చదువుకు మధ్యలోనే ఫుల్స్టాప్ పెట్టి బీబీఎం చదివేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ దౌత్యపరమైన నేరం చేయడంతో లండన్ పోలీసులు అతడిని ఢిల్లీ పంపించారు. డబ్బుల కోసం ఢిల్లీలో చిన్నచిన్న నేరాలు చేస్తూ జైలు కెళ్లిన ప్రణీత్ ఐదేళ్ల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం హైదరాబాద్ వచ్చి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టి జైలుకెళ్లాడు.
రెండేళ్లు జైలులో ఉన్న ప్రణీత్‌కు మోనూ, చోకాలతో పరిచయం అయింది. ముగ్గురూ కలిసి ఓ గ్యాంగ్‌లా ఏర్పడి ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్‌లలో ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఒక్కొక్కరిపైనా 50కిపైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసులు ప్రవీణ్‌పై గ్యాంగ్‌స్టర్ చట్టాన్ని ప్రయోగించడంతో అందరూ కలిసి హైదరాబాద్ వచ్చారు. గత నెల 23న హైదరాబాద్ కు వచ్చిన వీరు కాచిగూడలోని హోటల్లో దిగారు. 25న ‘ఓఎల్ఎక్స్’ ద్వారా ఓ బైక్‌ను అద్దెకు తీసుకున్నారు. 26న దానిపై తిరుగుతూ గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు.