jagan: జగన్ మాదిరి చింపేయండి, చంపేయండి అనే భాషను నేను వాడలేను: పవన్ కల్యాణ్
- విమర్శించే సమయంలో కూడా ఆదర్శవంతమైన భాషనే వాడాను
- తెలుగు రాష్ట్రాల్లో డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగాయి
- రాజకీయాలు నాకు వ్యాపారం కాదు
వైసీపీ అధినేత జగన్ ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ మాదిరి చింపేయండి, చంపేయండి అనే భాషను తాను వాడలేనని చెప్పారు. విమర్శించే సమయంలో కూడా తాను ఆదర్శవంతమైన భాషను మాత్రమే ఉపయోగించానని తెలిపారు. కడప జిల్లా నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
యువతను రాజకీయ శక్తిగా మార్చే బాధ్యతను తాను తీసుకుంటానని పవన్ తెలిపారు. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా, వ్యవస్థలో మార్పును తీసుకొచ్చే దిశగా జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేయడానికే మూడో పక్షంగా జనసేన ఆవిర్భవించిందని అన్నారు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని తాను అనుకున్నానని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించకముందే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను పెట్టామని వెల్లడించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగాయని... తనకు మాత్రం రాజకీయాలు వ్యాపారం కాదని తెలిపారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనే నమ్మకంతోనే గతంలో మోదీకి మద్దతు పలికానని చెప్పారు.