Facebook: ఫేస్బుక్లో ఫేక్ న్యూస్ షేర్ చేసేది ఎక్కువగా వృద్ధులేనట.. పరిశోధనలో వెల్లడి!
- ఫేక్ న్యూస్ షేరింగ్‌లో 65 ఏళ్లు పైబడిన వృద్ధులే అధికం
- 45 ఏళ్ల వారితో పోలిస్తే రెండింతలు ఎక్కువ
- అన్ని విషయాల్లోనూ తప్పుడు సమాచారమే
ఫేస్బుక్లో ఫేక్ న్యూస్‌ను ఎక్కువగా షేర్ చేసేది ఎవరో తెలిసిపోయింది. 65 ఏళ్ల పైబడిన వృద్ధులే ఫేక్‌న్యూస్‌ను ఎక్కువగా షేర్ చేస్తున్నట్టు న్యూయార్క్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వివిధ రకాల వయసున్న మొత్తం 3,500 మందిని అధ్యయనం చేయగా ఈ విషయం బయటపడినట్టు అధ్యయనకారులు తెలిపారు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వారి ప్రవర్తనను పరిశీలించిన శాస్త్రవేత్తలు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఫేస్బుక్లో ఎక్కువగా ఫేక్‌న్యూస్‌ను షేర్ చేస్తున్నట్టు కనుగొన్నారు.
లైంగిక విషయాలు, జాతి, సంపాదన, విద్యాసంబంధ విషయాలను ఫేస్బుక్లో తప్పుగా పేర్కొంటున్నట్టు అధ్యయనకారులు గుర్తించారు. వివిధ వయసులకు చెందిన వారిలో 8.5 శాతం మంది ఫేస్బుక్ యూజర్లు తమ ప్రొఫైల్‌లో కనీసం ఒక్క తప్పుడు సమాచారాన్ని అయినా షేర్ చేస్తున్నారు. అలాగే, 65 ఏళ్లకు పైబడిన వారిలో 11 శాతం మంది ఫేక్‌న్యూస్‌ను పోస్టు చేస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు, 45-65 ఏళ్ల మధ్యనున్న వారితో పోలిస్తే రెండింతలు ఎక్కువగా వీరు తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నట్టు అధ్యయనం తెలిపింది.