Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. నిందితుడు శ్రీనివాసరావును రహస్య ప్రాంతానికి తరలించిన ఎన్ఐఏ అధికారులు!

  • మరికాసేపట్లో ఎన్ఐఏ కోర్టు ముందు హాజరు
  • ఇప్పటికే కోర్టుకు చేరుకున్న డాక్యుమెంట్లు
  • హైకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేగం పెంచింది. ఈ కేసు విచారణను అందుకున్న ఎన్ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాసరావును నిన్న రాత్రి విశాఖపట్నం జైలు నుంచి విజయవాడకు తరలించారు. అనంతరం శ్రీనివాసరావును రహస్య ప్రాంతంలో ఉంచారు. మరికాసేపట్లో నిందితుడిని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. ఈ కేసులో సాక్ష్యాలు, ఆధారాలు ఇప్పటికే విజయవాడ కోర్టుకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ కేసును ఎన్ఐఏ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ పరిధిలోని కేసులో ఎన్ఐఏ జోక్యం చేసుకోవడంపై హైకోర్టు వేకేషన్ బెంచ్ ను ఆశ్రయించాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. హైకోర్టుకు జనవరి 21 వరకూ సెలవులు ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని భావిస్తున్నారు.

మరోవైపు జగన్ కేసులో ఎలాంటి పిటిషన్ దాఖలైనా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన న్యాయవాది హైకోర్టులో ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 25న జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నారు.

  • Loading...

More Telugu News