local pols: పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు.. మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం
- తొలివిడత ఎన్నికలు జరిగే వాటిలో 291 కైవసం
- మొత్తం 334 స్థానాలకు సింగిల్ నామినేషన్
- కాంగ్రెస్ ప్రభావం అంతంతే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్ అదే జోరును పంచాయతీ ఎన్నికల్లోనూ కనబరుస్తోంది. తొలివిడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు సంబంధించి బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియగా 4,480 సర్పంచ్ స్థానాలకు, 39,832 వార్డు సభ్యుల స్థానాలకు ఈనెల 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. వీటిలో 334 సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్ దాఖలయింది. ఇందులో ఏకంగా 291 స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే ఉండడం గమనార్హం.
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 8 పంచాయతీల్లోను, 3 పంచాయతీల్లో న్యూడెమక్రసీ, సీపీఎం, బీజేపీలు ఒక్కో పంచాయతీలో పాగా వేయనున్నాయి. తొలివిడత ఎన్నికలకు గాను 27,940 మంది సర్పంచ్ స్థానాలకు, 97,690 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారని గురువారం ఎన్నికల అధికారి ప్రకటించారు. నామినేషన్లు పరిశీలించి పోటీకి అర్హులైన వారి జాబితాను ప్రకటించారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఏకగ్రీవ సర్పంచ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించి సంప్రదింపులు, బేరసారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే ఆయా పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. రెండో విడత ఎన్నికల సమరం శుక్రవారం నుంచి ప్రారంభమయింది. ఈనె 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పోటీకి అర్హులైన వారి జాబితా ప్రకటిస్తారు. రెండో విడత ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి.