Andhra Pradesh: తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు గుడ్డలు ఊడదీసి పంపారు.. అయినా చంద్రబాబుకు సిగ్గురాలేదు!: కొడాలి నాని
- టీడీపీ ఎమ్మెల్యేలూ జీతాలు వెనక్కి ఇవ్వాలి
- జగన్ మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు
- కోడెల శివప్రసాద్ రావు అసమర్థ స్పీకర్
23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు వారితో జగన్ ను విమర్శిస్తూ లేఖ రాయించారని వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ‘ఈ పోటుగాళ్లు సంవత్సరానికి 365 రోజులు అసెంబ్లీకి పోతున్నారా? బడ్జెట్ సెషన్ ఓ 20 రోజులు, శీతాకాల, వర్షాకాల సమావేశాలు మరో 10 రోజులు.. అన్నీ కలిపి గట్టిగా 30 రోజులు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేవలం 30 రోజులు అసెంబ్లీకి హాజరై 365 రోజుల జీతాలను టీడీపీ నేతలు తీసుకుంటున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు 30 రోజులు పోగా మిగిలిన జీతాన్ని వెనక్కు ఇచ్చేస్తే.. తాము కూడా అందుకున్న వేతనాలను తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి హాజరై జగన్ మాట్లాడితే మైక్ కట్ అవుతుందనీ, రోజా, తనలాంటి నేతలు గట్టిగా నిలదీస్తే 1-2 సంవత్సరాలు సస్పెండ్ అవుతామని తెలిపారు. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు ఇచ్చి అడ్డమైన వాళ్ల దగ్గరకు వెళ్లి సమాధానాలు చెప్పేలా చేస్తారని వ్యాఖ్యానించారు. ఏపీ స్పీకర్ కోడెల లాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదన్నారు.
గతంలో పార్టీ మారినందుకు జోగి రమేశ్, పేర్ని నానితో పాటు తనను అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ డిస్ క్వాలిఫై చేశారని గుర్తుచేసుకున్నారు. 11 నెలల పదవీకాలం మిగిలిఉండగా ఈ చర్య తీసుకున్నారన్నారు. ఇప్పుడేమో అసమర్థుడైన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చంద్రబాబు సూచనలతో అసెంబ్లీని నడుపుతున్నారని విమర్శించారు.
అందువల్లే తాము అసెంబ్లీకి పోవడం లేదనీ, ఒళ్లు బలిసి కాదని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే ఇప్పుడు జగన్ పై కూడా చంద్రబాబు తన యెల్లో మీడియాతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడకు పోటుగాడిలాగా వెళ్లిన చంద్రబాబును ప్రజలు గుడ్డలు ఊడదీసి పంపారని ఎద్దేవా చేశారు. అయినా ఆయనకు సిగ్గు రాలేదన్నారు.