Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. శ్రీనివాసరావును హైదరాబాద్ కు తీసుకెళ్లనున్న ఎన్ఐఏ!
- నేడు కస్టడీలోకి తీసుకునే అవకాశం
- ఏడు రోజులు అప్పగించిన ప్రత్యేక కోర్టు
- థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును నేడు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీలోకి తీసుకోనుంది. విజయవాడలోని ప్రత్యేక కోర్టు శ్రీనివాసరావును ఏడు రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడిని విచారణ కోసం అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు.
అనంతరం హైదరాబాద్ లోని తమ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టనున్నారు. కాగా, శ్రీనివాసరావు కోరుకుంటే అతని లాయర్ ముందే విచారణ జరపాలనీ, థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని ఎన్ఐఏను కోర్టు ఆదేశించింది. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై కోడికత్తితో శ్రీనివాసరావు అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో లోతైన గాయం కావడంతో జగన్ హైదరాబాద్ కు చేరుకుని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.