Karnataka: స్కూలుకు ఆలస్యంగా వెళ్లాడని కొట్టిన తల్లి.. మనస్తాపంతో రైలు పట్టాలపైకి దూకేసిన యువకుడు!
- సడెన్ బ్రేకు వేసిన రైలు డ్రైవర్
- త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
- యువకుడిని పరామర్శించిన సీఎం కుమారస్వామి
ఇటీవలి కాలంలో పిల్లలు మరీ సున్నితంగా తయారు అవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాడని తల్లి కొట్టడంతో ఓ యువకుడు(18) రైలు కింద దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి సడెన్ బ్రేకు వేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కర్ణాటకలోని బెంగళూరులో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఇటీవల స్కూలుకు ఆలస్యంగా వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి తల్లి కోపంతో అతడిని కొట్టింది. దీంతో మనస్తాపం చెందిన అతను ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నగరంలోని ఓ మెట్రో స్టేషన్ కు చేరుకుని రైలు వచ్చేవరకూ ఎదురుచూశాడు. ట్రైన్ దగ్గరకు వస్తుండటం చూసి పట్టాలపైకి దూకేశాడు. అయితే యువకుడిని గమనించిన మెట్రో డ్రైవర్ మదివలప్ప రైలుకు సడెన్ బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది.
కాగా, పట్టాలపై దూకడంతో సదరు యువకుడి తలకు గాయమైంది. దీంతో బాధితుడిని మెట్రో అధికారులు బెంగళూరులోని నిమ్ హాన్స్ ఆసుపత్రి(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్)కు తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడిని కర్ణాటక సీఎం కుమారస్వామి పరామర్శించారు. చిన్నచిన్న విషయాలకే తొందరపడి ప్రాణాలు తీసుకోవడం సరికాదని సూచించారు.