Telangana: టోల్ ట్యాక్స్ ను రద్దు చేసిన తెలంగాణ.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న టోల్ నిర్వాహకులు!
- నేడు, ఈ నెల 16న ట్యాక్సులు రద్దు
- ఆదేశాలు జారీచేసిన సీఎస్ జోషి
- ఉత్తర్వులు పాటించని టోల్ సిబ్బంది
సంక్రాంతి సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రజలపై భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ గేట్ల వద్ద ఈరోజు, ఈనెల 16న రెండ్రోజుల పాటు టోల్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ ప్రకటించారు. ప్రజల సౌలభ్యం, ట్రాఫిక్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోషి తెలిపారు. మరోవైపు ఏపీ నిన్న, ఈరోజు, ఈ నెల 16న టోల్ ఫీజు ఎత్తివేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రభుత్వ ఆదేశాలను టోల్ నిర్వాహకులు అస్సలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా పంతంగి, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలో టోల్ ఫీజును వసూలు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా టోల్ ఫీజు వసూలు చేయడం ఏంటని ప్రజలు టోల్ సిబ్బందిపై మండిపడుతున్నారు.