velmati chandra shekar janardhan rao: ప్రముఖ పారిశ్రామికవేత్త వెలమాటి దాతృత్వం.. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రూ.40 కోట్ల భారీ విరాళం

  • ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో కొత్త నిర్మాణాలు
  • క్యాన్సర్, కార్డియాలజీ బ్లాక్స్ నిర్మాణం
  • విరాళంగా రూ.40 కోట్లు ఇచ్చిన వెలమాటి  

ప్రముఖ పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో ఎన్నో విరాళాలు ఇచ్చిన ఆయన మరోసారి భారీ విరాళమిచ్చి తన ఉదారతను చాటిచెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో క్యాన్సర్, కార్డియాలజీ బ్లాకుల నిర్మాణానికి గాను రూ.40 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ భవన నిర్మాణాలకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన్ని సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, తదితరులు ఆయన్ని ప్రశంసించారు.

కాగా, చంద్రశేఖర జనార్దనరావు ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఇప్పటివరకు పలుసార్లు విరాళాలిచ్చారు. తన స్వస్థలమైన కొవ్వలి 'జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల'కు అదనపు భవనాలు, ఫర్నిచర్, ప్రయోగశాలలు ఏర్పాటు నిమిత్తం గతంలో విరాళాలిచ్చారు. ఏలూరులోని సర్ సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2000 సంవత్సరంలో టెక్నాలజీ కేంద్రం ఏర్పాటుకు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి రూ.10 కోట్లు, 2014లో ఏపీలో సంభంవించిన హుద్ హుద్ తుపాన్ బాధితుల సహాయార్థం ఒక కోటి రూపాయలను, ఏలూరు ఆసుపత్రిలో తలసేమియా రోగుల చికిత్స కేంద్రం భవనానికి కోటి రూపాయలను ఆయన విరాళంగా ఇచ్చారు.

 జనార్దన రావు స్వస్థలం కొవ్వలి

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో ఆయన జన్మించారు. పదో తరగతి వరకు ఆయన విద్యాభ్యాసం కొవ్వలిలోనే కొనసాగింది. ఆ తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో ఇంటర్ మీడియట్ విద్య, బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అనంతరం, బిర్లా టెక్నికల్- ఎగ్జిక్యూటివ్ సర్వీసులో చేరి కోల్ కతాలోని హిందూస్థాన్ మోటార్స్ లో రెండేళ్లు పని చేశారు. హైద్రాబాద్ లో రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ తయారీ సంస్థను ప్రారంభించారు. 1965లో వెల్ జన్ హైడ్రేయర్ ప్రైవేట్ లిమిటెడ్, 1973లో వెల్ జన్ డెనిసన్ లిమిటెడ్ ను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News