Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. నిందితుడు శ్రీనివాసరావును విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలించిన ఎన్ఐఏ!
- హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు నిర్ణయం
- విశాఖ అనువైన ప్రాంతం కాదని భావించిన అధికారులు
- శ్రీనివాసరావు తరలింపుకు ఉన్నతాధికారుల ఓకే
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు విశాఖపట్నంకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణ కోసం నిందితుడిని ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. ఈ విషయాన్ని నిందితుడి తరఫు న్యాయవాది సలీంకు తెలియజేశారు. విశాఖలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి నిందితుడిని హైదరాబాద్ లోని ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయానికి తరలించడానికి ఉన్నతాధికారులు అంగీకరించారు.
అంతకముందు ఇక్కడ శ్రీనివాసరావును విచారించడం కుదరదని భావించిన అధికారులు మరో చోటుకు తరలించేందుకు అనుమతిని కోరారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు జగన్ పై కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతుగా గాయం కావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో జగన్ చికిత్స చేయించుకున్నారు. అనంతరం జగన్ అప్పటి ఉమ్మడి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసును న్యాయస్థానం ఎన్ఐఏకు అప్పగించింది.