Love: అమ్మాయిల మధ్య చిగురించిన ప్రేమ.. వివాహ బంధంతో ఒక్కటైన యువతులు!
- కలిసి చదువుకున్న అమ్మాయిలు
- ఒకే సంస్థలో ఉద్యోగాలు
- పెద్దలు తిరస్కరించడంతో కోర్టుకు..
ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి చదువుకున్నారు. పెద్దయ్యాక ఇద్దరికీ ఒకే సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి. ఒకే ఇంట్లో అద్దెకు ఉంటూ ఉద్యోగాలకు వెళ్లొచ్చేవారు. ఇలా చాలా ఏళ్లుగా కలిసి ఉన్న వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. విడిచి ఉండడం తమ వల్ల కాదని అర్థం కావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలకు చెబితే వద్దన్నారు. అయినా, వెనక్కి తగ్గని యువతులు పెళ్లి చేసుకున్నారు.
ఒడిశాలోని కేంద్రపడ పట్టణంలో జరిగిన ఈ స్వలింగ వివాహం స్థానికంగా సంచలనమైంది. పట్టాముండి, మహాకాలపడ గ్రామాలకు చెందిన సావిత్రి, మోనాలిసా కటక్‌లో కలిసి చదువుకున్నారు. ఒకే హాస్టల్లో ఉండేవారు. చదువు పూర్తయ్యాక ఇద్దరికీ అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలొచ్చాయి. ఇద్దరూ ఓ గదిలో అద్దెకు ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు యువతులు ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. అందుకు వారు తిరస్కరించడంతో కోర్టును ఆశ్రయించారు. తమలో ఒకరిని భార్యగా, మరొకరిని భర్తగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేశారు.