Telangana: పంటి నొప్పి అని వెళితే.. 32 పళ్లు ఊడిపోయాయి.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన పెద్దాయన!
- తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
- పంటి చికిత్సకు ఆసుపత్రికి వెళ్లిన పాండురంగారావు
- కేసు నమోదు చేసిన పోలీసులు
తన పంటి సమస్యను తీర్చాలని డెంటిస్ట్ వద్దకు వెళ్లిన ఓ పెద్దాయనకు వైద్యులు షాకిచ్చారు. వాళ్లు ఇచ్చిన ట్రీట్ మెంట్ పుణ్యాన సదరు పెద్దాయన నోట్లో ఉన్న 32 పళ్లు ఊడిపోయాయి. దీంతో ఆయన ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
బంజారాహిల్స్ లోని నందినగర్ కు చెందిన విశ్రాంత ఉద్యోగి పి.పాండురంగారావు (71) పంటి సమస్య వేధిస్తుండటంతో 2017 సెప్టెంబర్ 4న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. డెంటల్, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ బిందు పాండురంగారావు పళ్లకు క్యాప్ అమర్చారు. ఇందుకు రూ.6.96 లక్షలు వసూలు చేశారు.
అయితే కొంతకాలానికే పాండు రంగారావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మరోసారి కిమ్స్ దవాఖానకు వెళ్లగా డాక్టర్ ప్రత్యూష గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సేతుబాబు వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరీక్షలు నిర్వహించి కొన్ని మందులు రాసిచ్చారు. అవి వాడటంతో పరిస్థితి మెరుగు కాకపోగా, మరింత దిగజారింది.
ఈ క్రమంలో పాండురంగారావు 32 పళ్లు ఊడిపోయాయి. దీంతో ఆయన రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. వెంటనే రాష్ట్రపతి కార్యాలయం స్పందించి సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు.