Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి కాల్ డేటాను విశ్లేషిస్తున్న ఎన్ఐఏ అధికారులు!
- నాలుగోరోజు కొనసాగుతున్న విచారణ
- న్యాయవాది సలీంకు ముందుగానే సమాచారం
- ఏఎస్పీ సాజిద్ ఆధ్వరంలో విచారణ
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. నాలుగో రోజు కస్టడీలో భాగంగా ఎన్ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాసరావును హైదరాబాద్ లోని ప్రాంతీయ కార్యాలయంలో విచారిస్తున్నారు. న్యాయవాది అబ్దుల్ సలీంకు సమాచారం అందించిన అధికారులు.. అతని సమక్షంలోనే నిందితుడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఎన్ఐఏ అదనపు ఎస్పీ మొహమ్మద్ సాజిద్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. కాగా, ఈ విచారణలో భాగంగా శ్రీనివాసరావు కాల్ డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. అలాగే శ్రీనివాసరావుకు ఉద్యోగం ఇచ్చిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి కాల్ డేటా ను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు జగన్ పై కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతుగా గాయం కావడంతో జగన్ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.