YSRCP: తెలుగు ప్రజలకు ఇది చీకటి రోజు: జగన్-కేటీఆర్ కలయికపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
- టీఆర్ఎస్ కాళ్ల వద్ద ఆంధ్రుల ఆత్మాభిమానం
- ఆంధ్రులపై కక్ష గట్టిన కేసీఆర్‌తో కలయికా?
- జగన్‌ను హైదరాబాద్‌కే పరిమితం చేస్తాం
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి-టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ కలయిక తెలుగు ప్రజలకు చీకటి రోజని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని టీఆర్ఎస్ కాళ్ల వద్ద జగన్ తాకట్టు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రులపై కక్ష గట్టిన కేసీఆర్‌ను జగన్ కలవడం సిగ్గుచేటన్నారు.
చంద్రబాబును చూసి భయపడుతున్న మోదీ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్‌తో కలిసి కొత్త నాటకం మొదలుపెట్టారన్నారు. జగన్‌ను ఎప్పటికీ హైదరాబాద్‌కే పరిమితం చేస్తామన్నారు. ఆంధ్రులు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలకు రాళ్ల దెబ్బలు తప్పవని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ వల్ల ఏపీలో యాదవులు తలదించుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలో బీసీ కులాలను రిజర్వేషన్ల నుంచి తొలగించినా తలసాని నోరెత్తకపోవడం సిగ్గు చేటన్నారు. మరోసారి ఆయన ఏపీలో అడుగుపెడితే 'ఖబడ్దార్' అని ఆయన హెచ్చరించారు.