Andhra Pradesh: జగన్ పై ఎందుకు దాడి చేశానో ప్రజలకు చెబుతా.. మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి!: కోర్టుకు శ్రీనివాసరావు విజ్ఞప్తి
- జగన్ పై దాడి గురించి పుస్తకం రాశాను
- ఎందుకు దాడిచేశానో దాంట్లో వివరించా
- శ్రీనివాసరావు ప్రాణాలకు హాని ఉందన్న లాయర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు ఈరోజు విజయవాడ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరాడు. అసలు ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో తాను ప్రజలకు చెబుతానని అన్నాడు. జగన్ పై ఎందుకు దాడి చేశానో జైలులో ఉన్నప్పుడు 22 పేజీల పుస్తకం రాశానని నిందితుడు పేర్కొన్నాడు.
జైలర్ దాన్ని తన దగ్గరి నుంచి లాక్కున్నారనీ, ఆ పుస్తకాన్ని తనకు ఇప్పించాలని కోరాడు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాసరావు తెలిపాడు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తరఫు లాయర్ వాదిస్తూ.. తమ క్లయింట్ ను 30 గంటల పాటు ఎన్ఐఏ అధికారులు రహస్యంగా విచారణ జరిపారని ఆరోపించారు.
విచారణ జరిపేటప్పుడు లాయర్లు ఉండాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు. విజయవాడ జైలులో శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇతర ఖైదీలను కలవకుండా అతనికి రక్షణ కల్పించాలని న్యాయమూర్తిని కోరారు. కేసు విచారణను కొద్దిసేపు వాయిదా వేసిన న్యాయమూర్తి.. మరికాసేపట్లో వాదనలు విననున్నారు.