one day: చెలరేగిన ధోనీ.. వన్డే సిరీస్ టీమిండియా కైవసం
- బ్యాట్ తో విమర్శకుల నోళ్లు మూయించిన ధోనీ
- 87 పరుగులు చేసి.. భారత్ ను విజయతీరాలకు చేర్చిన మిస్టర్ కూల్
- సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా
తానెంత విలువైన ఆటగాడో మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి నిరూపించాడు. విమర్శకుల నోళ్లు మూయించేలా ఒంటి చేత్తో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో చెలరేగి ఆడిన ధోనీ... ఇండియాకు సిరీస్ అందించాడు. ధోనీ, జాదవ్ అండతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 231 పరుగుల విజయలక్ష్యాన్ని 49.2 ఓవర్లలో ఇండియా ఛేదించింది. తద్వారా వన్డే సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
అంతకు ముందు టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో హ్యాండ్స్ కోంబ్ మాత్రమే రాణించాడు. కోంబ్ 58 పరుగులు చేసి తన వన్డే కెరీర్ లో మరో అర్ధ శతకం సాధించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో క్యారీ 5, ఫించ్ 14, ఖజావా 34, షాన్ మార్ష్ 39, స్టోయినిస్ 10, మ్యాక్స్ వెల్ 26, రిచర్డ్ సన్ 16, జంపా 8, సిడిల్ 10, స్టాన్ లేక్ 0 (డకౌట్) పరుగులు చేశారు. సిడిల్ నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్ చాహల్ తన అద్భుతమైన బంతులతో ఆసీస్ వెన్ను విరిచాడు. 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి 6 వికెట్లను కూల్చాడు. భువనేశ్వర్ కుమార్, షమీ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం ఆస్ట్రేలియా నిర్దేశించిన 230 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 15 పరుగులు ఉన్నప్పుడు డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిడిల్ బౌలింగ్ లో మార్ష్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం ధావన్ (23), కోహ్లీ (46) ఔటయ్యారు. ఈ క్రమంలో 113 పరుగులకే (30 ఓవర్లు) మూడు కీలకమైన వికెట్లను ఇండియా కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో అద్భుతమైన ఆటతీరుతో జాదవ్ తో కలసి ధోనీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. సమయోచితంగా ఆడుతూ, చెత్త బంతులను బౌండరీ లైన్ దాటిస్తూ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. మరో వికెట్ కోల్పోకుండా ఇద్దరూ కలసి భారత్ ను విజయతీరాలకు చేర్చారు. 114 బంతులను ఎదుర్కొన్న ధోనీ 6 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. జాదవ్ 57 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆరు వికెట్లు తీసిన చాహల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా... ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ధోనీని వరించింది.