kolkata: భవిష్య కార్యాచరణ ఎలా అన్నదే మనందరి ముందున్న ప్రధాన ప్రశ్న: జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ

  • త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది
  • అప్పటికే మనం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి
  • కూటమి విధివిధానాల అజెండా సిద్ధం చేసుకోవాలి

భవిష్య కార్యాచరణ ఎలా అన్నదే మనందరి ముందున్న ప్రధానమైన ప్రశ్న అని జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ అన్నారు. కోల్ కతాలో బీజేపీ యేతర పక్షాల ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, అప్పటికే మనం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని, కూటమి విధివిధానాల అజెండా సిద్ధం చేసుకోవాలని సూచించారు.

 మన మధ్య విభేదాలు, అంతరాలను పక్కనబెట్టి పని చేస్తే తప్ప ఫలితం ఉండదని, మాయావతితో పొత్తు ప్రకటించిన మరుసటి రోజే అఖిలేష్ యాదవ్ పై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని, దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని భయానక వాతావరణం సృష్టించాలనుకుంటున్నారని కేంద్రంపై విమర్శలు చేశారు. మనం సరైన మార్గంలో సాగితే ప్రజలందరూ మన వెంటే వస్తారని, రెండు, మూడు పార్టీలుండే రాష్ట్రాల్లో సీట్ల పంపకం ఆషామాషీ వ్యవహారం కాదని, బలమైన భారతావనిని నిర్మించేందుకు సుస్థిర ప్రభుత్వం అవసరమా అనే ప్రశ్నను మోదీ రేకెత్తించారని, గడచిన నాలుగున్నరేళ్లలో మోదీ సాధించింది అది ఒక్కటే అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి లుకలుకలు లేకుండా విశ్వాసం కల్గించాలని, ప్రజలకు నమ్మకం కల్గించగల్గితే మార్పును స్వాగతించేందుకు వాళ్లు సిద్ధంగా ఉంటారని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. 1996-97లో వ్యవసాయం రంగంలో 9.8 శాతం వృద్ధిరేటు ఉండేదని, సంకీర్ణ ప్రభుత్వంలోనే వ్యవసాయం రంగంలో 9.8 శాతం వృద్ధి సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా దేవెగౌడ గుర్తుచేశారు. సంకీర్ణ ప్రభుత్వం, అస్థిర ప్రభుత్వం ఏమీ చేయలేదని మోదీ చెబుతున్నారని, సంకీర్ణ ప్రభుత్వం వృద్ధి సాధించి చూపగలదని నిరూపించాలని పిలుపు నిచ్చారు. ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని, జాతీయ స్థాయిలో నేతలు సమస్యకు పరిష్కారం చూపగలగాలని దేవెగౌడ సూచించారు.

  • Loading...

More Telugu News