kolkata: కోల్ కతాలో ముగిసిన యునైటెడ్ ఇండియా భారీ బహిరంగ సభ
- సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో నిర్వహించిన సభ
- భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనపై చర్చ
- మమతకు అభినందనలు తెలిపిన నేతలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కోల్ కతాలో ఈరోజు నిర్వహించిన యునైటెడ్ ఇండియా బహిరంగ సభ ముగిసింది. ఇక్కడి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం, వివిధ పార్టీల అగ్రనేతలు సమావేశం కానున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనపై చర్చించనున్నారు.
ఈ సభ విజయవంతం కావడంపై మమతా బెనర్జీకి ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాద్ పార్టీ అగ్రనేత అఖిలేశ్ యాదవ్ లు తమ అభినందనలు తెలిపారు. కేంద్రం తీరుకు నిరసనగా మరిన్ని బహిరంగ సభలకు ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం.
తదుపరి సభను ఢిల్లీలోనా లేక ఏపీ, కర్ణాటకలో నిర్వహించాలా? అనే అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో రాజకీయ పరిణామాల విషయం కూడా నేతల మధ్య ప్రస్తావనకు వచ్చింది. పరిధులు దాటి కేంద్రం వ్యవహరిస్తే కనుక జాతీయ స్థాయిలో పోరాడాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.