T-congress: వంటేరు తన స్వలాభం కోసమే పార్టీని వీడారు: వీహెచ్ విమర్శలు
- కాంగ్రెస్ పార్టీలో ఆయనకు చాలా ప్రాధాన్యమిచ్చాం
- పార్టీ మారుతున్న నాయకులకు బుద్ధి చెప్పాలి
- జగన్ వద్దకు టీఆర్ఎస్ నేతలు ఎలా వెళతారు?
కాంగ్రెస్ పార్టీ తరపున గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన వంటేరు ప్రతాప్ రెడ్డి నిన్న టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శలు గుప్పించారు. వంటేరు తన స్వలాభం కోసమే కాంగ్రెస్ ను వీడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు చాలా ప్రాధాన్యత నిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ మారుతున్న నాయకులకు బుద్ధి చెప్పాలని, పార్టీ మారి వచ్చే వారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వొద్దని సూచించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్ గురించి ఆయన ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ కోసం నాడు లేఖ ఇచ్చిన చంద్రబాబుతో తాము కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడ్డ జగన్ వద్దకు టీఆర్ఎస్ నేతలు ఎలా వెళతారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్కని నియమించడంపై ఈ సందర్భంగా వీహెచ్ హర్షం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని సీఎల్పీ నేతగా నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కి కృతఙ్ఞతలు తెలిపారు.