Federar: ఆస్ట్రేలియా ఓపెన్ లో ఫెదరర్ కు అవమానం... కార్డు లేదని ఆపేసిన సెక్యూరిటీ!
- లాకర్ రూమ్ కు వెళుతుంటే అడ్డుకున్న సెక్యూరిటీ
- ఓపికగా వ్యవహరించి, కార్డు తెప్పించి, చూపిన ఫెదరర్
- విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు
టెన్నిస్ ప్రపంచంలో రారాజు, స్విస్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రోజర్ ఫెదరర్ కు ఆస్ట్రేలియా ఓపెన్ లో అవమానం ఎదురైంది. ఆయన తన లాకర్ రూముకు వెళుతున్న వేళ, ఐడీ కార్డు లేదన్న కారణంతో ఓ సెక్యూరిటీ గార్డు నిలిపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సెక్యూరిటీ గార్డు తనను నిలిపివేయడంపై ఫెదరర్ ఎటువంటి ఆగ్రహాన్ని తెచ్చుకోకుండా, నిగ్రహంతో, తన అసిస్టెంట్ ను పంపి ఐడీ కార్డు తెప్పించుకుని, దాన్ని చూపించి, ఆపై లోనికి వెళ్లి తన స్వభావం ఎటువంటిదో చెప్పకనే చెప్పాడు. అయితే, ఎన్నో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెదరర్ ను ఇలా అడ్డుకోవడంపై నెటిజన్లు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.